A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
Share |
May 24 2019, 4:48 am

తెలంగాణ ఎన్నికల రాజకీయాలలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ క్రీడ లో కాంగ్రెస్ తో పొత్తు పొత్తు ఒక అంకం అయితే, దివంగత రాజ్యసభ సబ్యుడు నందమూరి హరికృష్ణ కుటుంబంతో చేస్తున్న రాజకీయం మరో ఎత్తుగా చెప్పాలి.హరికృష్ణ కుమార్త సుహాసినిని సీనియర్ నేత పెద్దిరెడ్డిని కాదని కుకట్ పల్లి నియోజకవర్గ మహాకూటమి అభ్యర్ధిగా ఎంపిక చేశారు. ఆమెను వెంటబెట్టుకుని బాబాయి బాలకృష్ణ నామనేషన్ వేశారు.అయితే మహాకూటమిలోని ముఖ్య భాగస్వామి అయిన కాంగ్రెస్ కండువాలు,జెండాలు లేకుడానే వెళ్లినట్లు కనిపించింది.తాను కూటమి తరపున ప్రచారం చేస్తానని బాలకృష్ణ చెప్పారు. అయితే జూనియర్ ఎన్.టి.ఆర్ ,కళ్యాణ్ రామ్ లు కాంగ్రెస్ తో కలిసి ఉన్న టిడిపికి ఎలా మద్దతు ఇవ్వాలని మదన పడ్డారో ఏమో కాని, వారు నామినేషన్ కార్యక్రమానికి వెళ్లలేదు.అయితే టిడిపి పవిత్రమైనదని అంటూ ఏదో సందేశం ఇచ్చి సోదరి గెలవాలని ఆకాంక్షించారు.వారి దృష్ఠిలో టిడిపి పవిత్రమైనది అయితే కాంగ్రెస్ తో పొత్తు కూడా పవిత్రమా?అపవిత్రమా అన్నది కూడా చెప్పి ఉండాల్సింది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్.టి.ఆర్.కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏమటి? ఆయన కుమారుడు బాలకృష్ణ చేస్తున్నదేమిటి? చివరికి వీరందరు ఎన్.టి.ఆర్.పేరు చెప్పుకుంటూనే, ఆయనకు తీరని అవమానం తెస్తున్నారా అన్న భావన కలుగుతోంది. నిజంగానే తెలంగాణలో టిడిపికి దమ్ము ఉంందనుకుంటే మొత్తం అన్ని చోట్ల పోటీ చేయాలని వీరు చంద్రబాబుకు చెప్పి ఉండవచ్చు. తాము ఇంతకాలం తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కాంగ్రెస్ మద్దతు తీసుకుని పోటీచేస్తామని, వారికి ప్రచారం చేస్తామని చెబుతుంటే నిజంగా ఎన్టిఆర్ జీవించి ఉంటే ఎంత బాదపడేవారో. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్.టిఆర్.ఈ పార్టీని స్థాపించారు. డిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటున్న తీరును ఆయన నిరసించారు. అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు నాయుడు తన మామ ఎన్.టి.ఆర్.పైనే తొడగొట్టి సవాల్ చేశారు. సినిమావాళ్లకు రాజకీయాలు ఏమి తెలుసునని ఆయన అనేవారు. కాని ప్రజలంతా టిడిపి కి పట్టం కట్టడంతో ఆయన తెలివిగా టిడిపిలోకి వచ్చారు. మామ ఎ న్.టి.ఆర్. అల్లుడున్న బలహీనతతో పలువురు టిడిపి నేతలకు ఇష్టం లేకపోయినా,ఆయనను టిడిపిలోకి తెచ్చారు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్.దగ్గర చంద్రబాబు కర్షక పరిషత్ చైర్మన్ అయ్యారు. అనంతరం తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని వదలి టిడిపికి గట్టి పట్టు ఉన్న కుప్పం కు మారారు.ఆ తర్వాత వ్యూహాత్మకంగా టిడిపిని తన అదీనంలోకి తీసుకోవడం ఆరంబించారు.తదుపరి ఎన్.టి.ఆర్.రెండో భార్య లక్ష్మీపార్వతి సాకుతో ఏకంగా ఎన్.టి ఆర్ పదవికే ఎసరు పెట్టి ఆ సీటులో కూర్చున్నారు. అమాయకుడైన ఎన్.టి.ఆర్.పదవి పొగొట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరికి తన అల్లుడు ఇంత ఘోరమైన వ్యక్తి అని ఒక వీడియో రిలీజ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎన్టిఆర్ పదవి కోల్పోయిన తర్వాత ఆరు నెలలు జీవించే ఉన్నారు. అప్పుడు ఎన్.టి.ఆర్ ను చంద్రబాబు విమర్శించిన సందర్భం లేకపోలేదు. ఎన్.టి.ఆర్. కాలం చేసిన తర్వాత అసలు తానే ఎన్.టి.ఆర్ కు అసలైన వారసుడనని ప్రకటించుకున్నారు.ఎన్.టిఆర్.ప్రభుత్వాన్ని కూలదోసేటప్పుడు ఎన్.టి.ఆర్ కుటుంబంలోని ఇతర సభ్యులంతా తనకు మద్దతు ఇచ్చేలా చేసుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.తనను మోసం చేశారని తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుసుకున్నా,అప్పటికి జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఎన్.టి.ఆర్. మరణం తర్వాత కొన్నేళ్లకు మళ్లీ టిడిపితో కలవాలని దగ్గుబాటి అనుకోకపోలేదు. కాని చంద్రబాబు ఆ దరిదాపులకు రానివ్వలేదు.దాంతో అవమానబారంతో దగ్గుబాటి దంపతులు వైఎస్ రాజశేఖరరెడ్డి తాము గౌరవిస్తామని చెప్పడంతో కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయంలో ఎన్.టి.ఆర్ .కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ తరపున బాపట్ల నుంచి పోటీచేశారు. అప్పుడు ఆమె సోదరుడు బాలకృష్ణ దగ్గుబాటి స్వగ్రామమైన కారంచేడు వెళ్లి కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసి తన సోదరిపై కూడా సవాల్ చేసిన తీరు పలువురిని విస్మయానికి గురి చేసింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా తన కుమారుడు లోకేష్ ను బాలకృష్ణ కుమార్తకు ఇచ్చి వివాహం చేసి బాలకృష్ణ బెసగకుండా,రాజకీయంగా నోరు ఎత్తకుండా చేయడం లో సఫలం అయ్యారు. హరికృష్ణ కూడా చంద్రబాబు చేతిలో అవమానాలకు గురయ్యారు.ఎమ్మెల్యేగా లేనప్పుడు మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్యే అయిన తర్వాత అసలు పట్టించుకోలేదు.దాంతో ఆయన సొంత పార్టీ పెట్టుకున్నా సక్సెస్ కాలేదు.ఆ తర్వాత టిడిపి ఓడిపోవడంతో చంద్రబాబు మళ్లీ హరికృష్ణను దగ్గరకు తీసుకుని ఎమ్.పి పదవి ఇచ్చారు. అయినా వారిద్దరి మధ్య పొరపొచ్చాలు ఏదో రూపంలో కొనసాగేవి. 2009 లో జూనియర్ ఎన్.టి.ఆర్.ను ఎన్నికల ప్రచారంలో వాడుకుని, ఆ తర్వాత తన కుమారుడు లోకేష్ కు పోటీ అవుతారేమోనన్న భావనతో ఆయనకు ప్రాధాన్యత లేకుండా చేశారని అంటారు. రాజకీయంగా ఎన్.టి.ఆర్.కుటుంబాన్ని కకావికలం చేయడం లో చంద్రబాబు సఫలం అయ్యారన్నది ఎక్కువ మంది బావన. అంతేకాక ఎన్.టి.ఆర్ పిల్లలు కూడా తమకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా వ్యవహరించడం కూడా అప్రతిష్ట తెచ్చి పెట్టింది. చివరికి చంద్రబాబు ఏమి చేసినా సమర్ధించే దైన్య పరిస్థితి ఆ కుటుంబంలోని పలువురు చేరుకోవడానికి ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు. హరికృష్ణ మరణం తర్వాత ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్ ను రాజకీయంగా వాడుకోవడానికి యత్నించారు కాని ఆయన అంగీకరించలేదని చెబుతారు. తదుపరి హరికృస్ణ కుమార్తె సుహాసిని ని ప్రోత్సహించి రాజకీయంలోకి లాగారు. ఆమెకు ఇంతవరకు రాజకీయాల పైన ఆసక్తి ఉన్నట్లే ఎవరికి తెలియదు. ఇక్కడే చంద్రబాబు ఒక వ్యూహం అమలు చేస్తున్నట్లుగా ఉంది. సుహాసిని గెలిస్తే అది తన ప్రతిభ అని చెప్పుకోవచ్చు. సుహాసిని ఓడిపోతే హరికృస్ణ కుటుంబం అప్రతిష్ట పాలు అవుతుంది. ఇందులో చంద్రబాబుకు కొత్తగా పోయేది ఏమీ ఉండదు. నిజానికి సుహాసిని అయినా బాలకృష్ణ అయినా కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడాన్ని ఎలా సమర్ధిస్తున్నది చెప్పగలగాలి. సుహాసిని రాజకీయాలకు కొత్త కాబట్టి ఆమెను ఏమి అనలేం.పదవి వస్తుందని ఆశపడి ఎన్నికల బరిలోకి దిగవచ్చు. ఒకవేళ ఓడిపోతే ఆమె మళ్లీ అటువైపు చూడకపోవచ్చు. కాని గత అనేక ఏళ్లుగా రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న బాలకృష్ణ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే ముందు తన తండ్రి పరువు గురించి ఒక్క క్షణం ఆలోచించి ఉంటే బాగుండేది.ముందు వచ్చిన వచ్చిన చెవుల కన్నా తర్వాత వచ్చిన కొమ్ములు వాడి అని అంటారు.అలాగే తనకు తండ్రి కన్నా, ఇప్పుడు వియ్యంకుడు కూడా అయిన బావ చంద్రబాబే ముఖ్యం అని భావనకు వచ్చాక ఎన్.టి.ఆర్.గురించి ఎందుకు ఆలోచిస్తారు.కాకపోతే ఇంతకాల ఎన్.టి.ఆర్.కు అభిమానులుగా ఉన్నజనం బాలకృష్ణ తీరు చూసి రాజకీయం ఇంత దిగజారుతుందా అని బాదపడతారు. ఇక బాలకృష్ణ టిడిపి కండువాతో పాటు తాను ఇంతకాలం బండబూతులు తిట్టిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కండువాను కూడా కప్పుకుని,టిడిపి జెండాతో పాటు కాంగ్రెస్ జెండాను సైతం తగిలించుకుని ప్రచారం చేయడమే మిగిలింది.మొత్తం మీద చంద్రబాబు రాజకీయం ముందు ఎన్.టి.ఆర్.కుటుంబం వెలవెల పోయిందన్నది వాస్తవం.

tags : telangana, ntr, puppet

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info