A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ వాక్చాతుర్యానికి ,కాంగ్రెస్ ఉనికికి అగ్ని పరీక్ష
Share |
July 20 2019, 2:24 am

తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దుకు సంబందించి ఇచ్చిన వివరణ అంత సంతృప్తి కలిగించకపోయినా, ఆయన వాక్చాతుర్యాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.కాంగ్రెస్ పార్టీ ఆయా ప్రాజెక్టులపై కేసులు వేస్తోందని, అబివృద్ది ఆగకుండా ఉండడం కోసం , అడ్డగోలు ఆరోపణలకు సమాధానంగా శాసనసభను రద్దు చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. పైగా ఎనిమిది నెలలకు ముందుగా ఎన్నికలకు వెళ్లడం ద్వారా తాము త్యాగం చేశామని ఆయన అంటున్నారు.ప్రజలలోనే ఎవరు ఏమిటో తేల్చుకుంటామని ఆయన చెబుతున్నారు. నిజమే! ఒకసారి అసెంబ్లీ రద్దు అయ్యాక ప్రజలలోనే తేలవలసి ఉంటుంది.ప్రజలపై అచంచల విశ్వాసంతో ముందస్తు ఎన్నికలకు వెళుతున్నామని టిఆర్ఎస్ చెబుతుంటే, ప్రజలలో నమ్మకం పోతోంది కనుకే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది.గత కొంతకాలంగా అసెంబ్లీ రద్దుపై వస్తున్న ఊహాగానాలకు కెసిఆర్ పుల్ స్టాప్ పెట్టి,తాను అనుకున్న విదంగా చేసేశారు. నిర్దిష్ట ముహూర్తం ప్రకారం ఆయన అసెంబ్లీని రద్దు చేయించారు . . ఇక ప్రదాన ప్రత్యర్ది కాంగ్రెస్ కాబట్టి దానిపై ఆయన విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ వారిని ఆయన దద్దమ్మలు, సన్నాసులు అని మండిపడ్డారు. తనను పీడ అంటారా అంటూ కాంగ్రెస్ వారే పీడ, దరిద్రం అని బదులు ఇచ్చారు.రాహుల్ గాంధీని బఫూన్ అని కూడా ఎద్దవ చేశారు. అంటే ఎన్నికల వేడిని ఆయన రాజేశారన్నమాట.నవంబర్ లోనే తెలంగాణ ఎన్నికలు వస్తే కెసిఆర్ కు కొంత అడ్వాంటేజ్ ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే అంతమాత్రాన అసలు నెగిటివ్ లేదని కాదు. ప్రత్యేకించి సచివాలయానికి రాకపోవడం, పెద్ద ఎత్తున అప్పులు తేవడం , మిషన్ భగీరద పూర్తి కాకపోతే ఎన్నికలలో పోటీచేయనని గతంలో ప్రకటించి ఉండడం వంటి కారణాలు ఉన్నా,రైతులకు పెట్టుబడి సాయం,కంటి వెలుగు, రైతు బందు వంటి కొత్త పధకాలు ఆయనకు ఉపయోగపడే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే సరిగ్గా ఎన్నికలకు ముందు రైతులకు ఎకరాకు రెండో విడత నాలుగువేల రూపాయల చొప్పున పంపిణీ జరగవలసి ఉంది.దాని ప్రభావం సహజంగానే టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉండవచ్చు.కాంగ్రెస్ పార్టీ కూటమి కట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు, కట్టినా సీట్ల పంచాయతీ చేసుకోవడానికి పట్టే సమయం వంటివి కూడా కెసిఆర్ కు కలిసి వస్తాయి.కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ పైన,ఆయన కుటుంబంపైన తీవ్ర విమర్శలతో రంగంలోకి దిగుతుంది.అవినీతి ఆరోపణలు గుప్పిస్తోంది. దానికి పోటీగా కెసిఆర్ తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించనున్నారు. ఒక్క విషయం ఒప్పుకోవాలి. విభజన తర్వాత కరెంటు కష్టాలు వస్తాయని పెద్ద ఎత్తున వాదించేవారు.కాని దానిని పూర్వ పక్షం చేసిన ఘనత మాత్రం కెసిఆర్ దే. అయితే పిరాయింపులు మచ్చ తెచ్చేవే అయినా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకుని విమర్శించే నైతిక అర్హత కోల్పోయింది.పైగా కాంగ్రెస్ ఎపిలో జగన్ చేస్తున్నట్లుగా దీనిపై పోరాటం చేయడంలో విఫలం అయింది.కాంగ్రెస్ ను శాశ్వతంగా బహిష్కరించానలి చెత్త పార్టీ అని ప్రచారం చేసిన టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుతో స్నేహం చేయడానికి ప్రయత్నించడం కాంగ్రెస్ కు నష్టం చేస్తుందా?లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.కెసిఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రదాన ప్రచార అస్త్రం కావచ్చు. అలాగే హైదరాబాద్ తో సహా శాంతి భద్రతల నిర్వహణను,పేకాట క్లబ్ లు లేకుండా చేసిన తీరు పై గట్టిగా ప్రచారం చేసుకుంటారు.అయితే మహిళలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం మైనస్.మరో మాట చెప్పాలి.105 మందికి టిక్కెట్లు ప్రకటించడం ద్వారా ఆయన కొత్త బాణికి పూనుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ రద్దు అయిన రోజే ఇంత మందికి పార్టీ టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటించడం జరగలేదు.అది టిఆర్ఎస్ శ్రేణులలో ఒక నమ్మకం పెచడానికి ఉపయోగించే చర్యగా కనిపిస్తుంది.ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఏక నాయకత్వం లేని పరిస్థితిని కెసిఆర్ తెలివిగా వాడుకునే సూచనలు ఉన్నాయి.వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య అయితే టిఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలు అవుతాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికలలో కెసిఆర్ తెలంగాణ ప్రజలను ఎలా తన వాక్చాతుర్యంతో మెస్మరైజ్ చేస్తారన్నది ప్రదాన పాయింట్ గా కనిపిస్తుంది.(గ్రేట్ ఆంద్రలోప్రచురితం)

tags : telangana, kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info