A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీది మోసమేనా-చంద్రబాబు చెప్పింది కరక్టేనా
Share |
July 20 2019, 2:12 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రదాని నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తామని హెచ్చరించారు.అంతేకాక బిజెపి ప్రభుత్వం అవినీతిలో పడిందని కూడా ఆయన ఆరోపించారు.మోడీ మోసగాడని కూడా చంద్రబాబు,ఆయన టీమ్ ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో ఎపి ప్రభుత్వం అవినీతిలో నెంబర్ ఒన్ గా ఉందని బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావుకాని ఇతర నేతలు కాని అంటున్నారు.కొంతకాలం క్రితం వరకు చంద్రబాబు నాయుడు తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, తనకు ఏమైనా జరిగితే తనచుట్టూ ప్రజలంతా వలయంగా నిలబడాలని కోరేవారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు మోడీపైనే ఆరోపణలు చేసే దశకు ఎదిగారు.ఒకప్పుడు మోడీ చాలా గొప్పవాడని, దేశం ఆయనతోనే అబివృద్ది చెందుతుందని ప్రచారం చేసేవారు.కాంగ్రెస్ చెత్త పార్టీ అని, దేశాన్ని, ఆంద్రప్రదేశ్ ను నాశనం చేసిందని విమర్శించేవారు. ఆ తర్వాత కాలంలో కేంద్రం నుంచి తాను ఎంతో సాదించానని, తాను తెచ్చిన నిదులు మరెవరు తెచ్చారని సవాల్ చేసేవారు. తదుపరి పరిణామాలలో బిజెపికి దూరం అయ్యారు.పొత్తుకు గుడ్ బై చెప్పారు.అంతే..వెంటనే స్వరం మారిపోయింది.మొదట బిజెపి ఏమైనా తనకు వ్యతిరేకంగా చేస్తుందా అని భయపడ్డారు. కర్నాటక ఎన్నికల తర్వాత ఏదో జరిగిపోతుందని వణికిపోయినట్లు మాట్లాడేవారు.తన ప్రభుత్వంపై కేసులు పెట్టేలా ఉన్నారని ప్రచారం చేసేవారు. దాంతో ఆయన కాంగ్రెస్ కు దగ్గర అవడం కూడా ఆరంభించారు.ఆ క్రమంలో ఆయన బిజెపి పై విమర్శల ఘాటు పెంచారు . మొదట భయపడినట్లు కనిపించిన చంద్రబాబు ఎందువల్ల మోడీ గుండెల్లో రైళ్లు పరుగు పెట్టిస్తానని అనేంతవరకు వెళ్లారు? నిజానికి ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ కూడా ఈ మాట అనలేదు.చంద్రబాబు ఇది ధైర్యంతో అన్నారా?లేక ఆయన గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే ఆందోళనతో ,ఒక ప్రస్టేషన్ తో అన్నారా అన్న చర్చ ఉంది. అయినా ఇప్పటికైతే ఆ మాటను మనం చెప్పలేం.చంద్రబాబుకు ఏదో అనుకోని ధైర్యం వచ్చి ఉండాలి.ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి.చంద్రబాబు అన్నట్లు మోడీ మోసం చేశారనే ఒప్పుకోవాలి.అదెలాగో చూద్దాం.ఓటుకు నోటు కేసులో చంద్రబాబు బుక్ అవుతాడని తెలిసినా ప్రధాని మోడీ అనండి, బిజెపి నాయకత్వం అనండి ఆయనను మూడేళ్లుగా రక్షిస్తోంది. అది ప్రజలను మోడీ మోసం చేయడమే కదా!రాజ్యాంగం ,చట్టం అందరికి సమానం అన్న సూత్రాన్ని చంద్రబాబు విషయంలో వర్తింప చేయకుండా మోడీ మోసం చేసినట్లే కదా!పోలవరం ప్రాజెక్టును కేంద్రం కట్టవలసి ఉండగా, చంద్రబాబు కోరిన వెంటనే ఆయనకు అప్పగించేశారు. ఇప్పుడు బిజెపి నేతలే పోలవరంలో చంద్రబాబు విపరీతమైన అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. అంటే చంద్రబాబు అవినీతికి ఆస్కారం ఇచ్చేలా మోడీ వ్యవహరించి ఎపి ప్రజలను మోసం చేసినట్లే కదా?పోలవరం ప్రాజెక్టుకు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని రీతిలో నాబార్డు రూట్ లో ఎనిమిదివేల కోట్లకు పైగా మోడీ సాయం చేశారు. అయితే అదంతా చంద్రబాబు తను చేసినట్లే చెప్పుకుంటున్నా చేష్టలుడిగిన రీతిలో మోడీకాని, ఆయన టీమ్ కాని మిగిలిపోవడం మోసం చేసుకున్నట్లే కదా!పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బంది రాకుండా ఏడు మండలాలను ఎపిలో కలిపి సాయం చేసిన మోడీని , 8 వేల కోట్ల వరకు నిదులు ఇచ్చిన మోడీని మోసగాడని చంద్రబాబు అనగలిగారంటే ఆ దైర్యాన్ని మెచ్చుకోవల్సిందే.పోలవరం నిధులకు లెక్కలు అడిగితే అది మోసం కింద వస్తుందని తెలుగుదేశం నాయకత్వం అనుకోవడం లో ఆశ్చర్యం ఏముంది.రాజధాని నిర్మాణానికి ముందుగానే 2500 కోట్ల సాయం చేసిన మోడీ ప్రభుత్వం ,ఎపి ప్రభుత్వం ఒక్క ఇటుక రాయి వేయకపోయినా, అన్ని కట్టేశామని యుసిలు పంపితే, హైకోర్టు కట్టేశామని,అందుకోసం ఖర్చు చేశామని లేఖలు పంపితే,అవును ,అవును అని చప్పట్లు కొట్టడం మోసమే కదా?నీరు-చెట్టు కింద వేల కోట్ల రూపాయలను తెలుగుదేశం కార్యకర్తలకు ఫలహారంగా ఇస్తున్నప్పుడు మోడీ ప్రభుత్వం కళ్లుమూసుకుని మనవాడేలే అని ఊరుకోవడం ఎపి ప్రజలను మోసం చేసినట్లే కదా?ఉపాధి హామీ నిధుల కింద వచ్చిన నిధులను చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ల ప్రచారం కోసమో ,ఇతరత్రా దారి మళ్లిస్తుంటే కనీసం ప్రశ్నించ లేకపోవడం మోడీ ప్రభుత్వం చేసిన మోసమే కదా!గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోతే తొక్కిసలాటకు కారణం ఏమిటని ,ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదని కేంద్రం అడగకపోవడం మోసం కాదా?కేంద్రం నుంచి ఐఐటి, ఐఐఎమ్., త్రిబుట్ ఐటి, ఐఐఎస్సి, సెంట్రల్ యూనివర్శిటీవి తొమ్మిది సంస్తలు ఇచ్చిన మాట నిజమే కావచ్చు. కాని అవన్ని చంద్రబాబు ఖాతాలో వేసి ఆయన తరపున కేంద్రం కూడా ప్రచారం చేయకపోవడం మోసమో అవుతుంది కదా!చంద్రబాబు అడ్డగోలుగా చేసిన ఎమ్మెల్యేల కొనుగోళ్లను మోడీ ప్రశ్నించకపోవడం మోసమే కదా..కాని వారికి అసెంబ్లీ సీట్లు పెంచకపోవడం మోసంగా చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబు కు న్యాయవ్యవస్థను మేనేజ్ చేయగల శక్తి సామర్ద్యాలు బాగా ఉన్నాయని తెలిసినా మోడీ ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలి ఉండడం కూడా మోసమే అవుతుంది.ప్రత్యేక హోదా అక్కర్లేదని, ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబు కోరిన తర్వాత ఆయన అడిగినట్లు నిధులు నేరుగా ఆయనకు అందచేయకపోవడం మోసంగా తెలుగుదేశం భావిస్తోంది.కాని ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమ మాత్రం మోసమే అని చెప్పాలి. చంద్రబాబు 89 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని ప్రచారం చేసుకున్నప్పుడు మోడీ ఒక్క మాట అనకపోవడం, ఆయనతో కలిసి ఎన్నికలలో కలిసి పోటీచేయడం ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది కదా. డ్వాక్రా మహిళ రుణాలన్నిటిని రద్దు చేస్తానని చంద్రబాబు అబద్దపు హామీలు ఇచ్చినప్పుడు బిజెపి కూడా వాటిని ప్రచారం చేసి గెలిచే ప్రయత్నం చేయడం కూడా మోసమే అవుతుంది. కాపుల కు రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు వారిని మభ్య పెట్టే హామీ ఇచ్చినప్పుడు అది సాధ్యం కాదని బిజెపి చెప్పకుండా ఎన్నికల ప్రయోజనం కోసం మౌనం దాల్చి, అదికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వపరంగా సాద్యం కాదని చెప్పడం లో చంద్రబాబు తో పాటు మోడీ కూడా మోసం చేసినట్లే అవుతుంది.సాదారణంగా విపక్షాలైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ ,కాంగ్రెస్,సిపిఐ,సిపిఎం వంటి పార్టీలు కేంద్రంపై విమర్శలు చేయవచ్చు.కేంద్రం,రాష్ట్రాం ఏమి చేయలేదని ప్రచారం చేయవచ్చు. కాని ఇక్కడ నాలుగేళ్లపాటు కలిసి ఉన్న బిజెపి,టిడిపిలు ఇప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటున్నాయి.బిజెపి మోసం చేసిందని టిడిపి, టిడిపి మోసం చేసిందని బిజెపి అంటున్నాయి. చంద్రబాబును నమ్మి మోసపోయామని అంటున్న బిజెపి, గతంలో మోడీ-బాబు జోడితో అబివృద్ది సాగిపోతోందని ప్రచారం చేసేది. అలాగే కేంద్రం నుంచి ఎంతో డబ్బు తెచ్చానని చంద్రబాబు అనేవారు. విజ్ఞత కలిగిన సీనియర్ నేతగా ప్రత్యేక హోదా అక్కర్లేదనన్నానని చంద్రబాబు అన్నారు.అంటే ఇప్పుడు ఎవరు ఎవరిని మోసం చేసినట్లు? ఇద్దరూ మోసం చేశారని విపక్షాలు అంటున్నాయి. మోడీ, చంద్రబాబు ఇద్దరు తాము చేసిన మోసాలకు ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన సమయం వస్తుంది.అయితే బిజెపి నుంచి ,కేంద్రం నుంచి అత్యధిక సహాయం పొంది, బిజెపి సహకారం, మోడీ గాలితో అదికారాన్నే పొందిన చంద్రబాబు నాయుడు మాత్రం మోడీని మోసగాడుగా చిత్రించి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేలా ప్రచారం చేసి తాను మళ్లీ గెలవాలని చేస్తున్న ప్రయత్నం ఇంకా పెద్ద మోసంగా కనిపిస్తుంది. ప్రజలు ఈ ఇద్దరిని భవిష్యత్తులో ఏ స్థాయి మోసగాళ్లుగా చూస్తారన్నది కాలమే తేల్చుతుంది.అంతేకాదు..మోడీ గుండెల్లో చంద్రబాబు రైళ్లు పరుగె్తిస్తారా? లేక చంద్రబబు గుండెల్లో మోడీ రైళ్లు పరుగెత్తిస్తారా, లేక మళ్లీ ఇద్దరు కలిసి ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తారా అన్నది కూడా చూడాలి.

tags : chandrababu, modi, cheating

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info