A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతుల ఆత్మహత్యలు- కారణం ఎవరు?
Share |
March 25 2017, 7:23 am

తెలంగాణ ఏర్పడితే ఆత్మహత్యలు ఉండవు.తెలంగాణ వస్తే రైతులకు అంతా మంచే జరుగుతుంది..ఇవి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చేసిన ప్రచారం. రైతులంతా కష్టాలలో ఉన్నారు..నేను పాదయాత్రలో వారి కష్టాలు చూశాను..అందుకే రుణమాఫీ చేస్తా..ఇది ఎన్నికల ముందు ఆనాటి విపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారం. టిఆర్ఎస్ అదినేత కెసిఆర్ కూడా లక్ష రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. ఈ హామీ నిజంగానే రైతులను బాగా ఆకర్షించింది. రెండు రాష్ట్రాలలోను ఈ రెండు పార్టీలకు ప్రజలు పట్టం కట్టారు.కాని జరిగిందేమిటి?తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 2014 లో 898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, 2015 లో 1358 మంది ఆత్మహత్యలు చేసుకోవడం విషాదం. ఆంద్రప్రదేశ్ లో రైతులు 2104 లో 160 మంది ఆత్మహత్య చేసుకుంటే, 2015 లో ఆ సంఖ్య మూడు రెట్లు పెరిగి 516కి చేరింది.ఈ పరిస్థితి బాధాకరం. నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన నివేదికలోని అంశాలు గమనిస్తే, రైతు జీవనమే దుర్భరంగా మారుతోంది.వ్యవసాయం అంటే గౌరవం లేని వృత్తిగా మారుతోంది. ఆ కారణంగా రైతు యువకులకు పెళ్లిళ్లు కూడా కావడం లేదని తేలింది.ఆ కారణంగా కూడా దేశంలో 23 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారంటే దేశానికి ఏ మాత్రం గౌరవం కాదు.అబివృద్ది చెందిన రాష్ట్రాలుగా భావించే మహారాష్ట్ర,తెలంగాణ,మధ్యప్రదేశ్ ,కర్నాటక ,చత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో ఈ రైతు ఆత్మహత్యలు జరుగుతుండగా, వెనుక బడిన రాష్ట్రాలైన బీహారు, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలోకాని గోవా,కశ్మీర్, హిమచల్ ప్రదేశ్ మిజోరాం, ఉత్తరాఖండ్ ,నాగాలాండ్ వంటి రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలే నమోదు కాకపోవడం విశేష పరిణామంగా భావించాలి. దీనికి కారణాలేమిటి?ఆ రాష్ట్రాలలో రుణమాఫీ వంటి హామీలు లేకపోయినా ఎవరూ ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు?తెలంగాణ ,ఎపిలలో ఎందుకు ఆత్మహత్యలు పెరిగాయి? రుణమాఫీ వంటి సాద్యం కాని హామీలు ఇచ్చిన నేతలు వాటిని అమలు చేయడలో అనేక సర్కస్ లు చేశారు. తెలంగాణలో లక్ష రూపాయలు వరకు మాఫీ చేస్తామని చెబితే,ఎపిలో ఆకాశమే హద్దుగా వాగ్దానాలు గుప్పించారు. బ్యాంకులలో ఉన్న రైతుల బంగారం కూడా విడిపిస్తామని ఎంతో సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబు చెబితే జనం నమ్మారు. ఆ తర్వాత అవి కుదరదని తేలింది.ఎనభైతొమ్మిది వేల కోట్ల రూపాయల మేర రైతుల అప్పు ఉంటే దానిని రకరకాలుగా కుదించి ఇరవైనాలుగువేల కోట్లకు తగ్గించారు.ఒక్కో రైతులకు లక్షన్నర వరకు రుణమాఫీ చేస్తామని పలు ఫరతులు పెట్టారు.అదికూడా ఒక్కసారే ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ దుర్మార్గం ఏమిటంటే రైతులు తమ అప్పులు కొద్దిగానో,ఎంతో కొంత తీర్చుకునే అవకాశం లేకుండా, మీరెవ్వరూ అప్పులే కట్టవద్దని ప్రచారం చేశారు.దానిని నమ్మి రైతులు మోసపోయారు. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా, రైతులకు మాత్రం ఉపశమనం జరగలేదు.వడ్డీ లు తడిసి మోపెడు అయ్యాయి.ఇది కాకుండా ప్రకృతి పరంగా వచ్చిన సమస్యలు, ప్రభుత్వాల ప్రాధాన్యతలు ఇవన్ని వెరసి రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి.రైతు విత్తనం వేసేటప్పటి నుంచి,పంట అమ్ముకునే వరకు ఉన్న కష్టాలను తీర్చడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి.ధనిక రాష్ట్రం అని గొప్పలు చొప్పుకునే ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పరిస్థితి ఏమని సమాధానం ఇస్తారు? తనంత తెలివి మంతుడు దేశంలోనే లేరని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏమని బదులు ఇస్తారు?రైతులకు అప్పుల మాఫీ కాదు..కావల్సింది.వారు పంటలను పండించడానికి అనువైన పరిస్థితులు. ఉత్పత్తులను విక్రయించుకోవడానికి అసరమైతే అన్ని అవకాశాలు. తద్వారానే రైతులు ఆత్మ గౌరవంతో బతకగలుగుతాడు.తెలంగాణ లో ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ధనిక రాష్ట్రం అని చెప్పుకోవడం ఎంత గౌరవం అన్నది విశ్లేషించుకోవాలి. ఆంద్రప్రదేశ్ లో రైతుల రుణాలు మాఫీ చేసేశామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ రైతులను మభ్య పెట్టాలనుకోవడం ఎంత అవమానం అన్నది ఆలోచించుకోవాలి.రైతులు కూడా ఎవరు వాస్తవం చెబుతున్నారు?ఎవరు అవాస్తవం చెబుతున్నారన్నది అర్దం చేసుకోకపోతే మోసం చేసేవారు ఎప్పుడూ ఉంటారు!

tags : ap, tleangana, farmers

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info