A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ-స్వర్గం-నరకం
Share |
March 25 2017, 7:18 am

నాకు అదికారం, మరుజన్మ, స్వర్గంపై వాంఛలు లేవు-ప్రజల కష్టాలు తీర్చడమే నా ఆశ - ఇది ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఒక శ్లోకానికి అర్దం .తనకు స్వార్ధం లేదని చెప్పడానికి మోడీ ఏకంగా మరో జన్మ, స్వర్గం వరకు వెళ్లారు. నోట్ల రద్దు వంటి చారిత్రక నిర్ణయానికి పేదల మద్దతు లభించిందని,అందుకే వారు కష్టాలు వచ్చినా చిరు నవ్వులతో స్వీకరించారని ఆయన అంటున్నారు.ఇక ఎన్నికల సంస్కరణలే తరువాయి అని చెబుతున్నారు.పదవి కోసం వెంపర్లాడడం, పదవి వచ్చాక ఇలాంటి నీతి వ్యాక్యాలు వినడం భారతీయులకు కొత్త కాదు.మోడీ స్వర్గం సంగతేమో కాని ప్రజలు మాత్రం నరకం చూడక తప్పడం లేదు. భావోద్వేగ ప్రసంగాలు చయగల మంచి మాటకారిగా పేరొందిన నరేంద్ర మోడీ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు.భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో అనేక మంది సీనియర్ లు ఉన్నారు.వారెవ్వరిలో ఒక్కరైనా నోట్ల రద్దు ఎందుకు చేశారని మోడీని ప్రశ్నించినట్లు వార్తలు రాలేదు? ఆ పార్టీ దయనీయ స్థితికి అదే నిదర్శనం. ఏ పార్టీ లో అయినా బహిరంగంగా విధానాలు సమర్ధించినా, అంతర్గతంగా జరిగే సమావేశాలలో మంచి,చెడు రెండూ చర్చించుకుంటారు.బిజెపిలో ఒకప్పుడు అలా జరిగేదన్న భావన ఉండేది. మరి ఈసారి అలాంటి అవకాశం ఇవ్వలేదో, ఇచ్చినా, ఎవరూ నోరు ఎత్తడానికి ధైర్యం చేయలేదో కాని బిజెపిలో దీనిపై అర్ధవంతమైన చర్చ జరిగినట్లు లేదు. ఇక్కడ క మాట గుర్తుకు తెచ్చుకోవాలి.2002 లో గుజరాత్ లో మత కలహాలలో అనేక మంది మరణించారు.గోద్రా రైలు దగ్దం ఘటన కానివ్వండి, ఆ తర్వాత సామూహిక హత్యాకాండలు కానివ్వండి ..అవన్నీ దేశానికి చాలా అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. ఆనాటి ప్రధాని వాజ్ పేయి ఢిల్లీలో దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని పదవి నుంచి తప్పించాలన్న చర్చ వచ్చింది. వాజ్ పేయి ఆలోచనలకు భిన్నంగా కూడా బిజెపి కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగింది. చివరికి మోడీని పదవి నుంచి తప్పించరాదని నిర్ణయించారు.అప్పట్లో మోడీపై టిడిపి అదినేత చంద్రబాబు వంటివారు తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను పదవి నుంచి తప్పించనందుకుగాను ఎన్.డి.ఎ.ప్రభుత్వానికి మద్దతు ఉపసంహారించాలన్నంత ఆలోచన చేసి,చివరికి టిడిపి తరపున స్పీకర్ పధవి కూడా తీసుకోకుండా ఉండిపోయారు.కాని ఈసారి ఇంత పెద్ద నిర్ణయం,దేశ ప్రజలందరిని ప్రభావితం చేసిన నోట్ల రద్దుపై అద్వాని వంటివారు బహిరంగంగా సమర్ధించడమో, వ్యతిరేకించడమో చేయలేదంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.పేదలంతా మద్దతు ఇస్తున్నారని మోడీ తనకు తాను చెప్పేసుకుంటున్నారు.ఏభై రోజుల తర్వాత శిక్షకు సిద్దం అవుతానని ఆయన గతంలో ప్రకటించిన నేపధ్యంలో తనకు ,తానే తీర్పు ఇచ్చుకున్నారన్నమాట.ఇంతకీ నల్లధనం ఎంత వచ్చిందో చెప్పలేని నిస్సహాయ స్థితిలో కేంద్రం ఉండిపోవడమే నోట్ల రద్దు సఫలం కాలేదనడానికి పెద్ద నిదర్శనంగా కనిపిస్తుంది.ఇక ఎన్నికల సంస్కరణల విషయానికి వద్దాం. పార్టీలకు విరాళాలు ఇచ్చే వారి వివరాలు బహిర్గతం కావాలని మోడీ అనడం తప్పు కాదు. అది మంచిదే.ముందుగా బిజెపి వైపు నుంచి చేసి చూపించితే అది ఆదర్శం అవుతుంది. కనీసం ఎవరు విరాళాలు ఇచ్చారన్న సమాచారం ఇవ్వడానికే నిరాకరించిన పార్టీలలో బిజెపి కూడా ఉంది.దీనితో పాటు ఫిరాయింపుల సంగతి చూద్దాం.ఒక వైపు రాష్ట్రాలలో ఇష్టారాజ్యంగా ఫిరాయింపులను చట్ట విరుద్దంగా ప్రోత్సహిస్తుంటే చేష్టలుడిగి చూస్తున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఏవో సంస్కరణలు తెస్తానని నమ్మబలికే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు ఇద్దరు టిడిపిలోకి చట్టవిరుద్దంగా చేరితే కనీసం వారికి నోటీసులు కూడా ఇవ్వని స్పీకర్ వ్యవస్థ కేంద్రంలో ఉంది. ఎపి,తెలంగాణలలో అయితే ఫిరాయింపుదారులనై ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రులు నిస్సిగ్గుగా తమ పార్టీ కండువాలు కప్పుతుంటే ,స్పీకర్ లు అండగా ఉండే దిక్కుమాలిన వ్యవస్థను కనీసం మందలించే ప్రయత్నం కూడా చేయని మోడీ నిజంగానే ఎన్నికల సంస్కరణలు తెస్తారా అన్న సంశయం కలుగుతోంది.అంతేకాదు.స్వయంగా బిజెపినే ఉత్తరాఖండ్ అనుభవంతో పాటు , అరుణాచల్ ప్రదేశ్ లో చేసిన ఫిరాయంపు రాజకీయం తర్వాత మోడీ చెప్పే సూక్లులలో నీతి ఎంత ఉందో అర్ధం చేసుకోవడం కష్టం కాదు.నిజమే ఎన్నికలలో నల్లధనం లేకుండా చేయగలగితే మంచిదే. కాని చిత్తశుద్ది లేకుండా ఎంత సేపు ఎన్నికల రాజకీయాలనే గమనంలో ఉంచుకుని మోడీ కూడా ఒక సాధారణ రాజకీయ వేత్తగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. తాను కేవలం రాజకీయ వేత్తను కానని, రాజనీతిజ్ఞుడనని రుజువు చేసుకునే అవకాశాలను మోడీ చేజార్చుకోవడమే కాక, తనే అనైతిక రాజకీయాలకు ఊతం ఇచ్చేలా వ్యవహరిస్తూ ఎన్నికల సంస్కరణల గురించి చెబితే ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్న సామెత మోడీకి కూడా వర్తిస్తుంది. ఆయన నిజంగానే రాజనీతిజ్ఞడుగా మారితే సంతోషమే.కాని అది జరిగేదెన్నడన్నదే ప్రశ్న.

tags : modi, heaven, hell,notes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info